డిసెంబరు 2, 2009

మీనాక్షి కూనిరాగాలు-41

సీత అనసూయ క్యాసెట్లో విన్నానీ పాట. రైలు బండి తయారి మొదలుగొని, అది పోయే విధానం, ఆ పైన దానిలో ప్రయాణం చేస్తున్న వారి వివరాలు కూడా అందిస్తుంది. ఓ సారి చూడండి.
” బండిరా పొగ బండిరా
దొరలెక్కే రైలుబండిరా, దొరసాను లెక్కే బండిరా

ఈడ కూత కూసేనురా ఆడ కూత కూసేనురా
నీలగిరి సెరువు కాడ నిలసి కూత కూసేనురా
బండిరా…

బండిని సేసిందెక్కడ సెన్నపట్నం ముందర
బండిని కాల్సిందెక్కడ మైసూరు పట్నం లోపల
సెన్నపట్నం ముందరే సిన్ని కన్సాల్లోళ్ళు
ఇంతలింతల బండిని సేసి ఈదులెంబడి తిప్పేరురా
బండిరా…
లచ్చిమంటే లచ్చిమి
దాని అబ్బడాల లచ్చిమి
కోడినిస్తానన్నాది కోడిపెట్టనిస్తానన్నాది
కోడి కాక కాలు రూపాయ్ కల్లు నిస్తానన్నది
సీమల్రోడ్డు పక్కన పోవు సిన్న గుంత కాడ
బాగ బతికిన రెడ్డి కొడుకు భంగపడిందక్కడరా
లచ్చిమంటే సొగుసురా దాని మొగుడు సూత్తే ముసలివాడు
బండిరా….
గమనిస్తే ఈ పాటకి అందం సీత అనసూయ పాడడంలో వుంది.             ఉదాహరణకి “దొరసాని” అన్న మాటని వారు వ్యంగంగా “దొర సాని” అని ఉచ్చరించి పాట యొక్క వ్యంగ్య ధోరణి నిలబెడుతూనే “బండిని సేసిందెక్కడో” ఈ వివరాలన్ని మనకందజేస్తారు. పాట బావుంది కదూ!

నవంబరు 26, 2009

మీనాక్షి కూనిరాగాలు-40

“విజన స్థలమున నీదు భజన చేయుచుందును గాని
కుజనులెంతటివారైనను కూడను కూడను కూడను రామ
విజన….
కల్పవృక్షములాంటి కథలు తెల్పుచునుందును గాని
అల్పులతో అన్యమాటలు ఆడను ఆడను ఆడను రామ
విజన….
చిత్తమూ నీ యందే చేర్చి చింత చేయుచునుందును గాని
విత్తము గోరి అన్యుల మరి వేడను వేడను వేడను రామ
విజన

నవంబరు 18, 2009

మీనాక్షి లేఖలు-9

డియర్ కృష్ణయామిని!
చాలా రోజులైపోయింది నీకు ఓ ఉత్తరమ్ముక్క  రాసి! అందుకే ఈ ఉత్తరం…నా అనారోగ్యం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. రిసెషన్ వల్ల హాస్పిటల్ వాళ్ళు కూడా ప్యాకేజ్ ప్రోగ్రాంస్ మొదలుపెట్టారు. పాపం అమాయక పతిదేవుడు నన్ను ఓ ప్యాకేజ్ ప్రొగ్రాం అనుసరించి   ట్రీట్మెంట్ కోసం పదిరోజులకి డబ్బులు కట్టెసి హాస్పిటల్ లో తోసేసి “హమ్మాయ్యా”! అనుకుంటూ జేబులలో చేతులు పెట్టుకుని నిల్చున్నారు.
భగవంతుడు దయ తలచి నాకు బయటకు రావడానికే అన్నట్లు ఓ అవకాశం కల్పించి “ఇక నీ ఏడుపు నువ్ ఏడువు” అన్నాడు. అంతే! నాకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లైంది. మూడు రోజులకే బయటకు వచ్చే ఇకిలించేసాను. నా ఆగమనం తరువాత మిగిలిన ఏడు రోజుల డబ్బు వాపసు చేయమంటే “అది కుదరదూ. ప్యాకేజ్ ప్రోగ్రాం లో వున్నవాళ్ళు ఎన్ని రోజులు వున్నా, పదిరోజులకీ డబ్బు కట్టాల్సిందే అన్నారు! హుం! “కిలం వదిలితే కాని ఫలం దక్కదులే”! అనుకుని మా శ్రీవారు వెనుదిరిగారు! అందుచేత ప్యాకేజ్ ప్రొగ్రాం లు టెస్ట్లు అంటే ఓ సారి అలోచించాలి! అడుసులోకి అడుగెట్టాకా, మనం అనుకున్నట్లు అడుగు పడదు. మన కార్పొరేట్ హాస్పిటల్స్ అడుసు కన్నా లోతైనవి! అడుగుపెట్టామా…అంతే సంగతులు మన వళ్ళు వారి కప్పగించవలెను!
ఇది ఇలా వుండగా నేను నా అందుబాటులోకి వచ్చిన మందుల పేర్లనన్నిటి జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాను! నేను గమనించిన గమ్మత్తైన విషయం ఏమిటంటే– మన మందుల కంపెనీల వారి లోని భావుకత్వ పటిమ పెల్లుబికి మందుల పేర్ల రూపంలో బయట పడుతోంది. ఉదాహరణకీ– మైగరిడ్–ఈ మాత్ర మైగ్రైన్ తలనొప్పిని పోగొట్టడానికి! ప్రొకాం– నిద్రకుపక్రమించడానికి ముందు మనకి కావలసిన ప్రశాంతతని చేకూర్చడానికి.కాంపోజ్ కాంగా పోజిచ్చి పడుకోడానికి. రెస్టిల్–కదలకుండా పడివుండడానికి. చూసావా మరి! ఎంత భావుకత బ్రద్దలైపోతోందో మన దేశంలో! కాబట్టి ఈ యాంత్రిక జీవన విధానంలో భావుకత చచ్చిపోతోందని ఎవ్వరూ బాధపడకూడదు! భావుకత వుండాలే కానీ, అది ఏదో ఓ రూపంలో బయటకు తన్నుకు వస్తుందన్న మాట!
అయితే మరి ఇప్పటికిక ఇంతే!
ఇట్లూ
మీనాక్షి.

నవంబరు 7, 2009

మీనాక్షి కూనిరాగాలు-39

చిగురాకుల పై చిరుగాలి
చెక్కింది ని పేరు
ఆ పేరులోని అక్షరాలు అగుపడని ఆణిముత్యాలూ,అగుపడని ఆణిముత్యాలు.

అవి పూలరేకులా? మన ప్రణయలేఖల?
ఆ పూలలో రేకులో నిలిచింది నీ రూపు నిలిచింది నీ రూపు.

చిగురాకుల పై చిరుగాలి…

అవి చివురు కొమ్మలా? మన వలపు రెమ్మలా?
ఆ కొమ్మపై ఆ రెమ్మపై ఊగింది నీ పేరూ, ఊగింది నీ పేరు.

చిగురాకుల పై చిరుగాలి…

అక్టోబర్ 28, 2009

నాకు నచ్చిన మరో మానస పూజ

“స్వామీ! మత్సంకల్పవికల్పంబులు నీ ఉభయ కావేరీ తీరంబులు. నా దేహమ్ము నీ రంగక్షేత్రమ్ము. నా సప్తావరణలు నీ సప్తప్రాకారములు.నా రజోగుణము నీకు హేమశృంగంబు. నా గర్వంబు మీకు ధ్వజ స్తంభంబు. నా వివేకంబు నీ విమాన ద్వారంబు. నా కామ, క్రోధంబులు నీ సువర్ణకవాటంబులు. నా ఙ్ఞాన వైరాగ్యంబులు నీ ద్వార పాలకులగు జయ విజయులు.నా భక్తి సంపద నీ పాదాంగుళీయంబులపై అర్పించిన తులసీ కుసుమంబులు. నా దూషణ, భూషణ, తిరస్కారంబులు ధూప, దీప, పరిమళ ద్రవ్యంబులు. నా భద్రంబు నీకు నైవేద్యంబు. నా ఆనందంబే కర్పూర నీరాజనంబు. నా శబ్ద, స్పర్శ, రూప, రసగంధంబులు నీకు ఛత్ర, చామర, అందోళికాది, నృత్య, గీతాది వాద్యంబులు. నా సంచారంబులు నీకు ప్రదక్షిణంబులు. తత్సమీపంబే నీకు సాష్టాంగ నమస్కారము.
రంగనాయక స్వామీ నమస్తే, నమస్తే, నమస్తే, నమః.”
“స్వామీ… మీకు నమస్కారములు…” ఇలా  నేర్చుకున్నాను నేను ఈ మానస పూజని. కాని “మీకు…” శబ్దం నాకు దేవుడికి దూరాన్ని పెంచిందనిపించింది…అందుకని నేను సొంత పెత్తనం చేసి “స్వామీ…నీకు…”అని మార్చాను.

అక్టోబర్ 18, 2009

మీనాక్షి కూనిరాగాలు-38

ఈ పాట కూడా ప్రసిద్ధి చెందినదే. దేవులపల్లివారి కలం నుండి వెలువడినది.

శివ శివ శివ అనరాదా ?
శివనామమె చేదా?
శివపాదము మీదా మీ శిరస్సు నుంచ రాదా?
భవసాగరమీద దుర్భర వేదన లేదా?

శివ శివ….
కరుణాళుడు కాడా ప్రభు
చరణ ధూళి పడనీవా?
హర హర హర అంటే మన,
కరువు తీరి పోదా?
శివ శివ…
కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా?
కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా?
మదనాంతకు మీద  నీ మనస్సెన్నడు పోదా?
మమకారపు పొర స్వామిని మనస్సారా కననీదా?

శివ శివ…
ఈ పాట ఇదివరకు పెట్టేనేమో తెలీదు. వచ్చేది కార్తీక మాసమని పెడుతున్నాను. వెనక్కి వెళ్ళి చూసే ఓపిక ప్రస్తుతం నాకు లేదు. మళ్ళీ పెడితే మరోసారి గుర్తు చేసుకోండి.

అక్టోబర్ 3, 2009

మీనాక్షి కూనిరాగాలు-37

467336931_9FZoS-S
పట్టు పట్టూర భాయి పట్టూ
వలేసి బాగ పట్టు
కలేసి బాగ చుట్టూ….
హొ సొ హై సొ హైలెస్సొ(2)
పట్టు ….
ఇంకిపోని సంద్రమందు
ఏలకొలది సేపలున్నై
ఒళ్ళు వంచి సూసుకుంటె
ఓపినంత ఫలితముంది
హొ సొ హై సొ హైలెస్సొ(2)
పట్టు …
గుంట పక్కన పట్టు
అరే గండు సేపని పట్టు
ఇసుకజెల్లని పట్టు
అరే ఏటి సేపని పట్టు
సెందురాని పట్టు సెందు
వాలుగ సేపట్టు
ఏరి ఏరి లాగు లాగు
తినే వాళ్ళ అదురుట్టం పట్టో
హొ సొ హై సొ హైలెస్సొ(2)
పట్టు …

అక్టోబర్ 2, 2009

కౌముది వెబ్ మాసపత్రికలో నా కవిత

ఈ నెల కౌముది వెబ్ మ్యాగజీన్లో నా కవిత(తొలిజల్లు) చదవండి! ఇంతకు పూర్వం అంతే మే లో పడింది మీరు ఎవరన్నా చూసి నాకు చెబితే  ఆనందిద్దామను కున్న! హచ్ మీరు నా కన్నా బద్దకస్తులూ లేదా విపరీతమైన బిజీ గా వుండేవాళ్ళో అయివుంటారు! ఎనివే ఈ సారి చెప్పేనుగా మరి చూస్తారా? చూడరా?హన్నా! హన్నన్నా!హెంత మాట అనేసింది ఈ కుంక బ్లాగరిని అనుకుంటున్నారా? హంతా హ హ ! హి హి! కోసమే!

సెప్టెంబరు 30, 2009

మీనాక్షి కూనిరాగాలు-36

woman-and-child-copy2

ఒల్లరె మావోయ్ సాములోరన్న
నేనొల్లరె మావోయ్ సాములోరన్న
జరుగుజరుగుమన్న
నే జరగలేనన్నా….
ఒల్లరె మావోయ్….
నందివాహన గజానన
చిలుకవాహన గజానన
మూషిక వాహన గజానన
పాహి పాహి గజాననా
పార్వతినందన గజానన(2)
ఒల్లరె….
కొండెక్కిపోవ్వాలా
నే పూవుకోయ్యాలా
ఎగువ యాదగిరి
దిగువ జొన్నవడ
ఒల్లరె….

సెప్టెంబరు 27, 2009

మీనాక్షి కూనిరాగాలు-35

2183020327_b58ae4301a_oనిన్నటితో 100 పోస్ట్స్ అశ్వినీశ్రీగా పూర్తి చేసానండి. నిజం చెబుతున్నాను ” మీనాక్షి కూనిరాగాలు” మొదలుపెట్టినప్పుడు నాకు ఇన్ని పాటలు గుర్తున్నాయని తెలీదు.మహా అయితే ఓ పదో పన్నెండో వ్రాయగననుకున్నాను. కాని సంఖ్య ఇప్పుడు 35 కి చేరింది. ఇదంతా పరోక్షంగా మా శ్రీవారూ, కస్తురి పద్మగారూ, కామెంటేసేసి మీరు అందరూ బాధ్యులే(బాధితులే= బాధలు పడ్డవారు, ఈ విగ్రహ వాక్యం బాగుందా? ఉషగారూ!). అందుకు మీకు మరో జనపదం. సునీతగారూ దీనికి కూడు డాన్స్ బ్రహ్మాండంగా కూర్చ వచ్చు! కాబట్టి మీ పాపని రెడి చేసేయండి.

“నోమీ నోమన్నలాల నోమన్నాలల చందమమా చందమమా
చుక్కల్లో సూరీడు సూటిగా పోడిసేడు(2)
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల….
ఆ సేల్లో కోతలు
ఈ సేల్లో కోతలు
వరిసేల్లో కోతలకే కూలీ జాస్తి అంట
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల….
ఆ వూరి మారాజు అర్థాణా ఇస్తాడు
ఓ సందామావయ్యలో
ఈ వూరిమగరాజు  ముప్పావలిస్తాడు
ఓ సందామావయ్యలో
ఆ వూరి మారాజు అర్థాణా ఇస్తాడు
ఈ వూరిమగరాజు  ముప్పావలిస్తాడు
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల…
ప్రొద్దు పొవ్వక ముంది ఇంటీకి సేరాల
పిల్లాపాపల కింత కూడైనయెట్టాలా
పోదారి రాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
సందమావా సందమావా
నోమీ నోమన్నలాల…”
(వుంటా మరి! ఇంట్లోని మగరాజుకి టీ అయినా పోయ్యాలా
పోయోస్తానమ్మ బ్లాగింటి సునీతమ్మ సందామామ సందామామ:) :) :) )