మీనాక్షి ఇక్కట్లు

మా మీనాక్షి ఇంటి తలుపులు తట్టాలంటే భయం. ఎప్పుడెలా ఎదురుపడుతుందో వూహించలేము.ఈ రోజు కూడా అంతే. తలకో గుడ్డ కట్టుకుని, అమృతాంజన్ వారి ప్రకటనలోని వనితలా నుదిటి మీద నలభై ముడుతలొచ్చేటట్లు  కనుబొమ్మల రెండిటినీ నిలబెట్టి,వాటితోబాటు చెవులు రెంటిని కూడా కొద్దిగా పైకి లేపి అబ్బో! జానపద చిత్రంలో వేగు పాత్రధారిలా వేగంగా వచ్చి తలుపు తీసింది.
  “ఏవైందే”? నా ప్రశ్నకు మూడుని పడుకోబెట్టి నడుము మీద గుద్దితే వచ్చే
ఆకారానికి ముచ్చటగా మూతిని తిప్పేసింది.
 “ఏం చెప్పను నా ఈ దుస్థితిని. పైన పెంట్ హౌస్లోనివారింట్లో పిల్ల పెద్దమనిషైందంటూ పేరంటం. కాస్త మాకంటే వారికి డాబా మీద కూర్చోబెట్టే అవకాశం వుందికదా అందుకే ఎక్కువమందిని పిలిచేసేరు. వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళికూర్చున్నాను నిన్న సాయంత్రం.అక్కడితో మొదలైందేమొ నా దుర్దశ.ఈ వారం వారఫలాలు చూసుకోలేదు.కూర్చోంగానే వచ్చింది మా పక్కింటావిడ.మహాగట్టిమనిషి, దొడ్డ ఇల్లాలు.కాగల కార్యాలన్నీ క్షణాల మీద నడిపించేస్తుంది. పిల్లల చర్చలూ, మొగుళ్ళ దురాగతాలు,అత్తలపై మిసైల్సు నడిపించేసాక ఇంక నేను లేస్తూ వుండగా  మొదలెట్టింది.’అదేమిటి అప్పుడే లేస్తున్నారు?భోజనాలకి వుండరా? ఆవిడేమో నాకు చెప్పింది మిమ్మల్నందరినీ జాగర్తగా చూసుకోమని. ఏవండి….ఇదిగో…ఈవిడ వెడతారటా అంటూ పెంట్ హౌస్ పెద్దని పిలిచేసింది.దాంతో మళ్ళీ చతికిల పడ్డాను.అప్పుడందుకుంది మా దొడ్డ ఇల్లాలు ‘ఇలా కూర్చోబెడితే మీకందరికి తోచుబాటు కాదు.అందరం కలిసి లలితా సహస్రం మొదలెడదాం.మీకొచ్చా? (రానివారొక్క క్షణం గతుక్కుమన్నారు) పర్లేదులెండి నా దగ్గర బుక్సున్నాయి.చదివితే అందరికీ మంచిది.’
లలితైంది.విష్ణుసహస్రమైంది.దీపాలెట్టారు. హారతులిచ్చారు.అపార్ట్మెంట్స్ ఆస్థాన గాయని వక్కంతం వనజాక్షి ముక్కుకంఠంతో అపర భానుమతిని తలపించేస్తూ  మూడు పాటలందేసుకుంది. ఆవిడమీద పోటితో మరో ఇద్దరు యుగళంగా ఆలపించేసేరు.అక్కడక్కడ ఇంకొందరాపాటకి కోరసిచ్చేసేరు.”హ్మ్…మీనాక్షి గట్టిగా ఊపిరి తీసుకుంది.’అయిందా..’అన్నాను.
అడ్డంగా తలూపింది”అప్పుడే ఎక్కడ? ఇంతలో ఓ కుర్ర వెధవ కాలు నొపెట్టిందో ఏమో లేచి నిల్చుని నడుం తిప్పేడు. అంతే! మా క్రిందింటావిడకి జోషొచ్చింది.’డాన్స్ చేయరా నాన్నా, వీడు భలే డాన్సరండీ అంటూ తగులుకుంది.(మా పక్కింటావిడికీ క్రిందింటావిడకీ పాపులరిటీ కాంక్ష ఎక్కువ.ఆవిడ భక్తి అంతే వెంటనే ఈవిడ రక్తి అంటుంది).దాంతో స్టార్ట్.పెద్ద గొంతుకతో స్టీరియొ మొత్తుకుంది.ఇంకేవుంది! కుర్రకపులందరూ ఏ భాగం కదుపుతున్నారో తెలియకుండా తెగ కుదిపేసారు.’ఇదేమిటబ్బా.. ఇది అదేను డబ్బా…దెబ్బ మీద ఈదెబ్బ వడ దెబ్బ వడ దెబ్బ
ఆగలేక ఈ దెబ్బ….’పాట సాగుతోంది.అప్పుడొచ్చారు అపార్ట్మెంత్స్లోని మగాళ్ళంతా.అసలు ఈ ఫంక్షను అందరిని ఎందుకు పిలిచారో,పిలిస్తే మాత్రం వాళ్ళెందుకు వచ్చరో! (మా వారు రాలేదు.బతికించారు).మీకేనా ఎంటర్టైన్మెంట్ మాక్కూడ అంటూ మా క్రిందింటాయనా భారీకాయాన్ని బర్రున అటూ ఇటూ ఊపేడు.మొహమాటంగా అవతల ఇంకొకాయన ‘ఇలంటివన్నీ వుండాలండీ.ఇదే మన సాంప్రదాయము. అప్పుడే అందరం కలుస్తుంటామూఅని అన్నాడు. పెద్ద కూర్చుని.. కూర్చుని నడుం నొప్పెట్టిందని వాళ్ళమ్మ దగ్గర గారాలు కురిసింది.దాంతో ఆవిడ భోజనానికి లేవండంది.అమ్మయ్యా….బతుకు జీవుడా !  అని రెండు మెతుకులు గతికి బయట పడ్డాను.
“మీనక్షి పెద్ద మనిషి ప్రహసనం ముగించి తలకి కట్టిన తలపగా తీసింది.”ఏదో ఇంట్లో పడ్డాను కదా కస్త హాయిగా పడుకుందామంటే… ఎదురుగా మ్యారేజ్ హాల్లో
వీడెవడో గౌడట.అర్థ రాత్రినించి మొదలూ.పెళ్ళి పేరుతో ఫెళ ఫెళ్ళాడించేస్తున్నాడు.వీడి పెళ్ళి నా చావుకొచ్చింది.తలలో వేయి ఎక్స్ప్రెస్ ట్రైన్లు పరిగెడుతున్నాయి.ఇది చాలదన్నట్టు ఈ స్కూల్లో ఈవేళ స్పోర్ట్స్ డే. సెంటర్లొ ఫ్లాట్ కాదుకానీ, నా బ్రతుకు బస్టాండైందనుకో!”
“బస్… అమ్మో బస్ టైమైందే. కీసరకి డైరెక్ట్ బస్.పోతే నా గతి అదో గతే! నే వస్త!
‘అయ్యో! కాఫి అయినా తీసుకోలెదే’…మీనక్షి మాటలు వినిపిస్తూనే వున్నయి నే లిఫ్ట్లోకి దుంకాను.

“అదీ సంగతి. మా మీనాక్షిలాగా ఎందరో! నా లాగా ఎందరో”అనుకుంటూ కొనుక్కున్న బజారు బరువంతా బుజాన మోసుకుంటూ బరువుగా అడుగేసాను.

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s