Monthly Archives: ఏప్రిల్ 2009

మీనాక్షి కూనిరాగాలు -26

ఈ మధ్యన ఈ టీ.వీ. లో పాత సినిమాలు రాత్రి 9.30కో 10.00కో వేస్తున్నారు.యాదృచికంగా నా చెవులబడింది–“షావుకారు” అనే  సినిమా వేస్తున్నారని(15-20 రోజులయ్యిందనుకుంటా). అంతే కూర్చున్నా,ఆ రోజంతా  తీరిక లేకుండా తిరిగేసినా సరే! అధిక శ్రమ, తరువాత భోజనం, అటు తరువాత బైఠాయించి కాచుకుని కూర్చున్నాను–“ఏమనెనే చిన్నారి ఏమనెనే…” అన్న పాట కోసం.ఇంతలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు కునుకు తీస్తూ, కళ్ళు తెరుస్తూ వున్న నాకు సరిగ్గా పాట ముందు బ్రేక్.అక్కడితో అయ్యిందా!” ఢీ” అనే రియాలిటి షో గురించి ప్రకటన. పోనీ! అది కూడా సరిపెట్టుకున్నాను.
ఇంతకీ ప్రకటనలో ఏమి చూపెట్టారని అడగరేం ?
ఇదిగో ఇదీ–
“ఓరోరి యోగి నన్ నలిపెయ్యరో, కొరికెయ్యరో, చంపెయ్యరో…నా శ్రాద్ధం పెట్టరో…” ఇదీ పాట.దానికి ఓ కుంక వెర్రి గంతులూ.
నేనెంత ప్రశాంతమైన పాట కోసం కూర్చున్నానూ…అక్కడ నాకెదురైందేమిటీ..హత విధీ!
ఇంతకీ కూనిరాగాలులో ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే.ఆడవాళ్ళు ఇటువంటి భావాలని వ్యక్త పరచకూడదు అని నేననను. కాని వాళ్ళలో సహజ సౌకుమార్యాన్ని  వెక్కిరించినట్లు ఈ విధంగా వ్యక్తపరచకూడదు అంటాను నేను. ఈ పాటని రాసిన వారెవరో…పాడిన  వారెవరో…దేవుడా టీ.వీ. లో కూడా నా కళ్ళ పడ కూడదు. పాపం శమించు గాక!అయితే ఇటువంటి భావనని సూచనప్రాయంగా వ్యక్త పరిచే సున్నితమై పాటని ఇస్తున్నాను.
బాలసరస్వతిగారనుకుంటాను పాడింది.
“ఏది స్వామి ఏది స్వామి ఊదుమొకపరి మరల మురళీ
ఏది స్వామీ
ఆవులన్నియు అటులె నిలచెను
పాములన్నియు పడగలెత్తెను
నింపవోయీ నింపవోయి వేణు రవళిని
సరసజీవన రాగ తరళి
                          ఏది స్వామీ…
నేను ప్రకృతిని నీవు పురుషుడవగుదు
వెలయగ లోకమందున
నింపవోయీ నింపవోయి వేణు రవళిని
సరసజీవన రాగ తరళి
                        ఏది స్వామీ…”
ఏమీ! కొరికెయ్యడం,నమిలేయ్యడం లేక పోయినా ఇందులో శృంగారపూరిత వాంఛ   వ్యక్తమవలేదా? మరి అప్పుడు అటువంటి పాటలెందుకు ఎంచుకుంటున్నారో మన సినిమా వాళ్ళు!
ప్రకటనలు

11 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

కుంచె కులుకులు-మీనాక్షి(నా చేతిలో నా ప్రపంచం)

“నా చేతిలో నా ప్రపంచం” అంటూ తన చేతినే ఫొటో తీసి నాకు పంపించిందో గడసరి! ఫొటో కంటే ఫొటోకి ఆ అమ్మాయి ఇచ్చిన వ్యాఖ్య నాకెంతో సంతోషానిచ్చింది. ఎందుకంటే నా చేతిలోనే వుంది నా ప్రపంచం మలచుకునే శక్తి అని ప్రతీ అమ్మాయి ఆత్మస్థైర్యంతో పూనుకుంటే చూడండీ! రాబోవు  రోజులలో ఎన్నో ఆగాయిత్యాలకూ, అత్యాచారలకూ, అనాచారాలకు అవకాశం అంతగా వుండకపోవచ్చును. ఇంతకీ, ఈవిడని “నువ్వే నువ్వమ్మా” అని పొగడి ఓ పెన్సిల్ స్కెచ్ రూపంలో మీకు పరిచయం చేసాను. నాకు నచ్చిన ఈ ఫొటో మీకోసం.

 

 

ఈ సూరిగాడిని పట్టుకుంటానంటున్నది కూడా ఆ చక్కని చుక్కేనండీ బాబూ! ఇది కూడా తన చేతికి తనే తీసిన ఫొటో!

1 వ్యాఖ్య

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కూనిరాగాలు(తడి తడి రాగాలూ-అనురాగాలూ-3)

సరే! నా మొదటి పాట చూసారుగా! ఆ పాటని పుచ్చుకొని మా అక్క నన్ను వాళ్ళ టీచర్
దగ్గరికి తీసుకెళ్ళింది.ఆ పాటని అవిడ ఎగా దిగా పరికించి, ఓ చూపు నన్నూ అలాగే చూడాలని ప్రయత్నించింది.నేను బెదురుగొడ్డును. మా గంభీరక్క వెనకాల సగం కనిపిస్తూ కనిపించకుండా కళ్ళు చిట్లిస్తూ  నిల్చునున్నాను.(ఈ కళ్ళు చిట్లించడం అన్నది నేనలవరచుకున్న ఆత్మ రక్షణా పద్దతి.నాకు మరింత భయమేసినప్పుడు మరింత ఎక్కువగా కళ్ళు చిట్లిస్తాను.వాడెవడో బాగా కోపం వస్తే, అతిగా నవ్వినట్లు. ఇంతకీ అలా కళ్ళు చిట్లిస్తే,జనం నాకు కొంచెం పొగరని, కోపమనీ,చిరాకని-ఇలా రకరకాలుగా అనుకుంటారు;అంటుంటారు. నిజానికి నాకు జనం అన్నా వాళ్ళ సూటి పోటి మాటలన్నా భలే భయం సుమండీ!అన్నట్లు, మీరెవరూ నాకెపుడూ ఎదురుపడరనే ధైర్యంతో ఈ నిజాన్ని కక్కేసా! కాబట్టి, ఖర్మ కాలి ఎన్నడైనా మనం ఎదురుపడితే ఇదంతా తూచ్ తూచ్!మీరు గుర్తుచేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడది అబద్ధమవగొడతా. ) ఇంతకీ నన్ను ఆవిడ చెయ్యి పట్టుకు లాగి “నీకు ఛాన్స్ ఇస్తాను. కాని నువ్ మా స్కూలని చెప్పాలి. సరేనా!” అన్నారు. నేను తల ఊపాను.
  సరే! ఆదివారం ఏడున్నరకి ఏ.ఐ.ఆర్. చేరుకున్నాము.8.30కి అనుకుంట అప్పట్లో బొమ్మరిల్లు కార్యక్రమం. మమ్మల్ని బయటే కూర్చోబెట్టారు. నా ప్రక్కన ఒక అమ్మాయి కూర్చుంది. పచ్చగా, ముద్దబంతి పూవు లాగా. ప్రక్కనే తన తమ్ముడనుకుంటాను. నేను ఆ అమ్మాయిని పదే పదే కళ్ళు చిట్లించుకుంటూ చూసాను. దాంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక పల్కరించేసింది.
“ఏం పేరు?” అంది .చెప్పాను.
” నీదో”? “లలితా సాగరి”!
“ఎందుకొచ్చేవ్”?
“మూడు నిమిషాలు మిగిలిపోయింది. నువ్వు రమ్మంటే వచ్చాను–పాడడానికి!” పూర్తిచేసింది.
నువ్వూ పాడడానికే వచ్చావా? ఆర్.సీ. ఎం. స్కూలా?” అడిగింది.
తల అటూ ఇటూ కాకుండా వూపాను.
నా గుండెల్లో కాంప్లెక్స్ బయలు దేరింది. అసలే తెల్ల పిల్లా! (నే నల్లగా వుంటాను) పైగా వాళ్ళే పిలిచారు పాడడానికి! నేను గొంతు మెదప గలనా…ఈ సందేహం నాకు వణుకు పుట్టించింది.సరిగా పాడకపోతే బుజ్జీవాళ్ళ టీచర్! అమ్మనాయనో!
   మొత్తానికి ప్రొగ్రాం ప్రారంభమైంది. మొదట లలితా సాగరి పాటే! అన్నట్లు చెప్పడం మరచి పోయాను. ఈవిడా సినిమాల్లో కూడా
పాడారండీ పెద్దైయ్యాకా! లలిత సంగీత ప్రేమికులకి ఈవిడ తెలిసే వుంటుంది. నేను ఏదో క్యాసెట్టు కూడా చూసాను. కొంచెం నాసల్ వాయిస్ కాని చాలా బావుంటుంది.మాది అదే తొలి కలయికా! అదే ఆఖరుదీను!

ఆవిడ ఆ రోజున పాడిన పాట మీ కోసం ఇక్కడ–

” త్రిలింగ దేశం మనదేనోయ్
తెనుంగులంటే మనమేనోయ్
దేశ భాషల తీరంలోకి
ఆంధ్రమ్మంటే అతి మధురం.

రాయలు మనవాడోయ్,
పండిత రాయలు మనవాడోయ్
కలం తిక్కన ఖడ్గ తిక్కన
గణపతిదేవులు మనవారోయ్”

                     త్రిలింగ దేశం మనదేనోయ్

గోదావరి కృష్ణా
తుంగభధ్ర పెన్నా
జీవధారల  నాదం తోటి           
విలసిలు దేశం మనదేనోయ్

                     త్రిలింగ దేశం మనదేనోయ్

 కొంచెం గూని పెట్టి, ఒక కాలితో తాళం వేస్తూ అద్భుతంగా పాడేసి మైమరచిపోయేలా చేసిందావిడ. తరువాత మా బుజ్జి నాటకంలో దొంగాడి పాత్ర మాంచి గంభీరంగా నిభాయించేసింది.మధ్యలో వ్యాపార ప్రకటన.
“నువ్ రా రమ్మ”ని నన్ను పిలిచారు. ప్రకటన సాగినంత సేపూ నేను భయపడుతూ గునిసాను . ఈ లోపు ప్రయాగవారు నాటకాన్ని దానిలోని నీతిని వివరిస్తూ, నను రమ్మని సైగ చేస్తూ తన పని తను చేసుకుంటూ పోతూ, తరువాత ఫలానా అమ్మాయి పాడబోతోందని ప్రకటించేసారు. నేను వెళ్ళాను. మొదలెట్టాను. ఇక్కడే వుంది అసలైన కొసరు కథంతా
నూ!
“వానంటే నాకిష్టం
వానొస్తే నాకిష్టం
ఎండా వానా కలిసొస్తే అన్నిటికంటే ఇష్టం”

వాన వస్తే వాన వస్తే
పొలం నిండా పంటలే
ఇంటి నిండా మూటలే…

పాట సాగుతోంది. ప్రయాగవారు టైం చూసుకున్నారు.
టక్కున గ్రాంఫోన్ మీద చెయ్యేసేసారు. అంతే!

 “ఆటల, పాటల బొమ్మరిల్లులో మళ్ళీ వారం కలుద్దాం “అంటూ వారి సిగ్నేచర్ ట్యూన్ ప్రారంభమైంది. దాంతో పాటే “బా గా పాడిందే, జే జేలు కొట్టండి” అనేసారు.గునిసి గునిసి నే మైకు ముందుకి వెళ్ళే టప్పటికి టైం కాస్తా ఐపోయింది. అయినా బుజ్జి వాళ్ళ టీచర్ తిట్టలేదు. ప్రయాగ వారు మాత్రం “మళీ రా ! ఈ సారి భయపడకుండా, ఫస్ట్ పాడాలి” అని బుజం తట్టారు. మళ్ళీ నేను ఆకాశ వాణికి పోయింది లేదు. ప్రయాగవారు ప్రాంతీయ వార్తలకి వెళ్ళిపోయారు.

అయ్యా! ఇదీ నా మొదటి పాట ప్రహసనం. ఇది అయ్యి ఇంటికి వచ్చానా… మా అన్నయ్యల్లిద్దరూ పండగ చేసుకున్నారు నన్నేడిపించి.ఇదిగో ఇలా “వానంటే నాకిష్టం…రండిపోదామిళ్ళకు”
అని ట్యూను కట్టి పాడుతూ!

శ్రీ మద్రమారమణ గోవిందో హారి! అయ్యా! రెండు సంచికలలో బ్లాగుతూనే బాదుతున్నానా…కొంచెం అలుపొచ్చింది కించిత్ కోక్ ఏమైనా కిడుతుందా?”

2 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

కుంచె కులుకులు(హం బనే తుం బనే ఎక్ దుజే కే లియే!)

గడసరి అమ్మాయి,
చేతిలో చెయ్యేసి,
చెంత చేరి,
చిలిపిగ నవ్విన వేళలో…

ఏమౌను మరేమౌను?
తమిళనాట పిపిపీ…డుండుండుం మారు మ్రోగును!!!

గమనిక: ఈ ఫొటోని నాకు మెయిల్ చేసినవారు, సుగంధిని.వర్డ్ ప్రెస్ వారు.ఇటువంటి “ఇరాటిక్ రీడింగ్స్”ని వీరు ఎంతో చాకచక్యంతో ఇట్టే పట్టేస్తారు.

వ్యాఖ్యానించండి

Filed under కుంచె కులుకులు-మీనాక్షి

మీనాక్షి కూనిరాగాలు(తడి తడి రాగాలూ-అనురాగాలూ-2)

                

                   ఈ శీర్షికన నేను పదే పదే గుర్తు చేసుకునే అనుభూతో, అనుభవమో మీతో పంచుకుంటున్నాను. ఈ విషయం మీకు తెలిసిందే కదా…ముందుకు పదండి!
  విజయవాడ ఆకాశవాణిలో బాలల కార్యక్రమం “బొమ్మరిల్లు” ని కొంత కాలం శ్రి ప్రయాగ రామకృష్ణగారు వినసొంపుగా తీర్చి దిద్దిన రోజులవి. ఆ కార్యక్రమాన్ని మేము ఆరుగురు పిల్లలం అలవాటుగా,ఆసక్తిగా వినేవాళ్ళం.
   నేను 5వ తరగతిలో వుండగా, మా అక్క రామ లక్ష్మి విజయవాడ ఆర్.సీ.ఎం. స్కూల్ తరపున ఆ కార్యక్రమంలో పాల్గునే అవకాశం సంపాదించుకుంది.వారు వేసే నాటకంలో ఈమెది దొంగాడి పాత్ర.పదిహేను రోజుల ముందే అక్కావళ్ళ టీచర్ ఈ విషయం చెప్పారు.సరే! ఈ మద్యలో వున్న ఆదివారం మేమందరమూ కార్యక్రమం వింటున్నాము.”వచ్చే వారం మన బుజ్జి గొంతు కూడా వినచ్చు ” అనుకుంటూ..
   ఇంతలో ప్రయాగవారు “పిల్లలూ! వాన మీద ఓ పాట వ్రాయండి.ఎంచక్కా! మీరే ఇక్కడ పాడేద్దురు గానీ!” అని ప్రకటించేసారు.
   మా బుజ్జికో అలవాటు వుంది!అది ఎక్కడికి వెడితే అక్కడికి నన్నూ ఈడ్చుకు పోతుండేది. ఏం తిన్నా,కొన్నా…ఏదైనా నాతో పంచుకునేది.వెంటనే అది “నువ్వు ఓ పాట రాయి. మా టీచర్ తో చెప్పి నిన్నూ తీసికెడతా” అంది. ఇంకేవుందీ! కోతికి కొబ్బరి కాయ దొరికింది!
   నేను సినీమా  గేయ రచయితలు చేసినట్టు ఓ బాణీ ఎంచుకుని దాంట్లో మాటలు కుదించడం మొదలెట్టాను. ఆ ప్రయత్నం కోసం నేనెంచుకున్న పాట
         “అమ్మంటే నా కిష్టం
          బొమ్మంటే నా కిష్టం
          అమ్మ, బొమ్మా అంటే అన్నిటికంటే ఇష్టం”
  ఈ పాట బాణిలో నే రాసిన పాట. నా మొదటి రచన కూడా అదే. అప్పుడు నాకు తెలుగు అంత పెద్దగా రాదు. (ఇప్పుడూ రాదనుకోండి.చేతకానప్పుడు చెప్పుకోడానికి సిగ్గెందుకు అని అసలు విషయం చెప్పేసా!)
    ఇంతకీ పాట విషయానికొస్తే, పాటని అప్పుతచ్చులతో మా పెద్దక్క శెషవేణికిచ్చి
తప్పులన్నింటినీ ఎడిట్ చేయించుకున్నాను.అయితే
నేనెంచుకున్న బాణీకి, నే కూర్చిన పదాలకీ పొంతన కుదరలేదు.ముఖ్యంగా చరణాల దగ్గర. దాంతో కొద్దిగా సంగీత ప్రవేశం వున్న మా శేషక్క చరణాలకి త్యూన్ మార్చింది. మొత్తానికి నా మొదటి పాట సిద్దమైంది. గుర్తున్న మేరకి ఆ పాటని క్రింద పొందు పరచుతున్నాను. ఓ సారి చూడందేం!

  వానంటే నా కిష్టం
  వానొస్తే నా కిష్టం
  ఎండా వానా కలిసొస్తే
  అన్నిటికంటే ఇష్టం.

   వాన వస్తే,
   వాన వస్తే
   పొలమంతా పంటలే
   ఇంటి నిండా మూటలే
                           వానంటే నా కిష్టం

వాన వస్తే
వాన వస్తే
అరుగు మీదే నేనుంటా
పడవలెన్నో వేస్తుంటా
                           వానంటే నా కిష్టం

వాన వస్తే
వాన వస్తే
అమ్మ చేసే పకోడిలు
ఆడుంకుంటూ అవి నే తింటాను

                          వానంటే నా కిష్టం…
 ఇదండీ ఆ పాట! ఇక రేడియోలో ఆ పాట నే పాడడం అది మరపురాని ఙ్ఞాపకం! అది నిజంగా తడి తడి రాగమే! దాన్ని గురించి మళ్ళీ చెబుతానేం!

4 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు

ఇహమా? పరమా?

ఏడు కొండలూ సాధారణంగా నడచి వెళ్ళడం అంటేనే నాకు మక్కువ. ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ, భక్తుల గోవింద నాదాలు వింటూ, వారి అవస్థ లు కంటూ…అదో ప్రత్యేకమైన అనుభూతి. వేంకటే శుడు కొండెక్కి ఎందుకు కూర్చున్నాడంటే, ఇదిగో ఇలా
ప్రతీ ఒక్కరికి చెప్పుకుందుకు ఓ అనుభవం మిగలాలని…      

            ***
    నేను గబ గబా అడుగేస్తున్నాను. సూరిగాడు సర్రున నెత్తినెక్కేడేమో, దగ్గరలోనే అని బయలుదేరేను కానీ,దూరం బాగానే వుందనిపించింది.దానికి తోడు దూరాన్ని  వయసు మరింత పెంచేసింది.
    మనసు నిలదీసింది”ఇప్పుడెందుకు బయలుదేరినట్టో? తిన్నదరగకా?పెళ్ళానికి కూడా అబద్దం చెప్పాల్సినంత ముఖ్యమైన విషయమా?తిరుమల నుండి తిరిగి వచ్చినది మొదలు అదే ఆలోచన వెంటాడుతోంది.అసలు ఎందుకంత తాపత్రయం?ఏమన్నా పనికొచ్చే విషయమా?…”
     నాకు తెలుసు మనసు అడిగే ప్రశ్నలన్నిటికీ మన దగ్గర సమాధానాలుండవనీ! పైగా ఆ ఆసక్తి కలిగించేది మనసే! కాకపోతే చపల చిత్తం గనుక…అటూ…ఇటూ…ఊగుతుంది.
     “హమ్మయ్య!” గడియారంవారి వీధి. బోర్ద్ కనపడింది. ఇంకేం వచ్చేస! ఇక ఇల్లూ పట్టుకోవాలి…అంతా స్వగతమే అయినా, “హమ్మయ్యా” మాత్రం పైకి వినిపించడం వల్ల కాబోలు, ప్రక్కనే నడుస్తున్న ఆయన ఓ చిరు నవ్వు విసిరాడు.
        మొత్తానికి ఇల్లు కూడా పట్టేసా! కానీ నే వెతుకుతున్న అతనూ,ఆమె ఇంతకీ అక్కడ వుంటారో లేదో!మనసుకేం పని వుంది? మళ్ళీ ఏడుకొండలయ్య నడకదారి చేరింది.

                  ***

అబ్బా! వయసు మీద పడిందనడానికేమో, మోకాళ్ళు మోకాళ్ళ పర్వతం అల్లంత దూరంలో వుండగానే మొరాయిస్తున్నాయి. “ఫర్లేదంకుల్! మాతో పోటి పెట్టుకోండి. మీరు అనుకుందానికంటే తొందరగా ఎక్కెయ్యగల్రు” ఒక యువకుడు ప్రోత్సహిస్తే, “వాతర్ కావాలా అంకుల్?”ఇంకొక యుకుడు అడుగుతున్నాడు.”అంకుల్ కి ఇవేమొద్దురా! వెనక ఆంటీ వస్తోందంటే, ఎనభై కొండలైనా, అరగంటలో ఎక్కేస్తారూ…”చనువుగా ఇంకొక యువకుడు అందుకున్నాడు. వీరెవరూ నాకింతకు ముందు పరిచయం లేదు. నడక దారి మొదటి మెట్టు పై మా స్నేహం ఆరంభం. వెను తిరిగి చూసాను. శ్రీమతి ఇంకెవరితోనో జతగూడి నెమ్మదిగా అడుగేస్తోంది.
    నిజమే!కొండలెక్కేటప్పుడు చిన్నవారితో కూడితే, కొండ కొంచెం చిన్నదై మన పని కొంచెం సుళువౌతుంది. ఈ విషయం నాకు అయిదారెళ్ళ క్రిందే తెలిసింది.అదేమిటో మనసు మరోసారి ఆయిందారేళ్ళ వెనక్కి పరిగెడతానంది…

               ***
“సార్! మీ ఏజ్ ఎంత సార్?
టక్కున వెను తిరిగి చూసాను. నాకు నవ్వొచ్చింది.
“ఏం?”
“ఏమీ లేదు సార్? ఇందాకటి నుండీ మేం చేసే
పని ఏమిటంటే, కొండ ఎక్కే వారి స్పీడ్ చూసి వారి ఏజ్ ఊహిస్తున్నాము. ఒకరిద్దరిని అడిగాము కూడా? కరెక్టుగా! ఎంత మేం ఊహించామో అంతే వుంది. మీ విషయంలోనే మాకిద్దరికీ పొంతన కుదరట్లే! నాకు తెలియకుండా నాలోఉత్సాహం   బయలుదేరింది.
“ఇంతకీ నా వయసు మీ దృష్టిలో ఎంతో?” ఎక్కువ చెప్పుతారేమోనన్న భయంతోనూ,తక్కువే చెప్పాలని కోరుకుంటూనూ,అడిగాను.
మీకు 40 అని వాడూ.45 అని నేనూ వాదించుకుంటున్నాము సార్”.
“హమ్మయ్య!”నాకు 48 అని ఆ క్షణమెందుకో చెప్ప బుద్ధి కాలేదు.కొండ మీద కదా! అబద్దం ఎందుకులే అని, “రెండోవారే రైట్” అని చెప్పాను.
  ఓ సారి అందరూ గొల్లు మని అరచి ” సార్! మీరు చాలా యాక్టివ్ గా
 వున్నారు. మాకంటే  స్పీడ్ గా ఎక్కుతున్నారే!” అంటూ పొగిడేసారు.
   ఇంతలో అందరూ నిశబ్దమైపోయి కళ్ళప్పగించి చూస్తున్నారు. చుట్టు ఎక్కుతున్నవారు కూడా గుమిగూడారు.’ఏమిటా …”
అని చూస్తే కొండ అంచుల మీద వున్న బండపై ఓ యువకుడు ఏదో వ్రాస్తున్నాడు. ఏ మాత్రం కాలు జారినా, ఇక అతని రూపు రేకలుండవు.
   “ఏమి వ్రాస్తున్నాడా..” నా ప్రక్క నున్న 18 ఏళ్ళ కుర్రాడు చదవడం మొదలెట్టేడు.”ఈశ్వర్

లవ్స్ కామాక్షి”చేతికంటిన పెయింట్   కాబోలు తుడుచుకుంటూ,గర్వంగా తనతో వచ్చిన యువతికేసి తిరగబోయాడు అంతే! అందరూ ఊహించినట్లుగానే అతను కాలు జార బోయాడు.నేనెంత మాత్రం ఆలేస్యం చేయలేదు.ఒక్క అంగలో అతనిని పట్టుకునన్నాను.నేనెక్కడ పట్టు తప్పుతానో అని నా ప్రక్కనున్న యువకులూ నన్ను పట్టుకుని,మొత్తనికి అతని ప్రాణాలు కాపాడేము.
    ఒళ్ళుమండి ఒక్కటిచ్చి, “ఏం మాయ రోగం! పబ్లిక్ న్యుసెన్స్ చేస్తున్నావు?”అన్నాను.
         “ఏం సార్! మాటలు మంచిగా రానీయడి.ఏదో హెల్ప్ చేసారు గనుకు తిరిగి కొట్టలేదు.లేకుంటే నా…”
    ఈ సమాధానంతో నాకూ తిక్క రేగింది.”ఈవేళ నేను రాకుంటే చచ్చుండేవాడివి.అసలు బుద్ధుండే అక్కడిదాకా వెళ్ళావా? చావాలని వుంటే ఇంకొక చోటు ఎంచుకో. ఈ పవిత్ర స్థలం ఎందుకు?”బీ.పీ. పెరిగిందేమో,గట్టిగా అరిచాను.
    “గొడవెందుకు పోదాం పద.”అప్పటిదాకా నిశ్శబ్ధంగా చోద్యం చూస్తున్న ఆ అమ్మాయి అతనిని లాగబోయింది.
    “ఏం కాదులే! సార్! నా ప్రేమ మీద నాకు నమ్మకం వుంది. నేను నా కామాక్షి తో నూరీళ్ళు బతుకుతాను. కావాలంటే చూడండీ!” అంటూ నేను వారించే లోపునే ఆ చోటుకి వెళ్ళి తన ఎడ్రెస్ అక్కడ వ్రాసి, ఆ అమ్మాయి వంక గర్వంగా చూస్తూ జాగర్తగా దిగి వచ్చేసాడు. ఆందోళనగా చూస్తున్న ఆ
అమ్మాయి కళ్ళళ్ళో కూడా ఒకింత గర్వమే కనపడింది,ఈ ప్రహసనం చూసేకా!
    నేను నిర్ఘాంతపోయాను. నాతో వున్న యువకులు నీళ్ళందించారు. ఎందుకో తెలియదు వాళ్ళూ అటు తరువాత మాట్లాడకుండానే కొండ ఎక్కారు. నేనూ అంతే!

                                ***
     చివరి మెట్టు దగ్గర తలుపు వుండడంతో, నే గతం నుండి ఈ లోకంలోకొచ్చి పడ్డాను.పదిహేను రోజుల క్రితం నే తిరుమల ఎక్కినప్పుడు ఆ పెయింట్ రాతలు చెదరకుండా అల్లాగే కనిపించడంతో నాలో ఉత్సుకత పెరిగింది. ఎందుకో తెలియదు –“నా కామాక్షితో నేను నూరేళ్ళూ బ్రతుకుతాను” అంటున్నా అతడు పదే పదే మస్తిష్కంలో మెదిలాడు.ఆ రాతలూ మెదడు పదిలపరచెసు కుంది. అందుకే ఆ ఎడ్రెస్ గుర్తుచేసుకు మరీ ఆ ఇంటి తలుపు తట్టాను.

  అయిదు నిమిషాల తరువాత ఆ తలుపు తెరుచుకుంది.జీవచ్చవము లాంటి స్త్రీ ఒకామే తీసింది.ఇంతలో దృష్టి గోడ మీద పడింది!ఆ యువకుడా? ఆ అవును! అతనే! ఫొటొలో పెద్ద బొట్టూ,ఫొటోపై దండవ్రేలాడుతూ.
“ఎవరు కావాలి?”
నోట మాట రాలేదు నాకు. వేలు చూపించాను.
కళ్ళ నీళ్ళు చిప్పిల్లుతూ,”హయ్యో! వాడా పోయి ఇరవై రోజులైయింది.వద్దురా అంటే,దాన్నే పెళ్ళాడతానన్నాడు. ఫ్రెండ్స్ కి శుభలేఖలు పంచుతామంటూ బండి మీద బయలుదేరేరు. హైవే మీద వెడుతూ వుంటే లారి గుద్దేసింది…”ఆవిడ ఏడుస్తూ చెప్పుతూనే వుంది. నేను నిలబడలేక క్రిందకి దిగి పోయాను.
              ***
ఏమిటో ఈ ప్రేమలు. ఇహమా? పరమా? వారి ప్రేమ గెలిచిందా? ఓడిందా? ప్రెమ గెలవాలనే కదా అతడు కొండెక్కి అంత సాహసం చేసింది.అసలు గెలుపేమిటో? ఓటమేటో? వారు పోయినా కాలానికి ఎదురొడ్డి ఆ రాతలు ఎన్నేళ్ళు నిలిచుంటాయో!
కళ్ళు బైర్లు కమ్ముతుండగా ఇల్లు చేరుకున్నాను.
“అలా అయిపోయారేమిటండీ? ఎక్కడికెళ్ళారు? ”
మంచి నీళ్ళందిస్తూ శ్రీమతి ఆందోళనగా అడిగింది.
“నేనింకెప్పుడూ తిరుమల నడచి ఎక్కను.”
“అలాగే లెండి! ఈ మజ్జిగ తాగి కాసెపు రెస్ట్ తీసుకోండి. కాళ్ళు నొప్పి పుట్టాయా? కాసేపు పట్టనా? మాత్ర వేసుకుంటారా…” నా మనసు
దేనినీ పట్టించుకోలేదు.ఇహానికి వారి ప్రేమ దూరమైయింది!అప్పుడది గెలిచినట్టా? ఓడినట్టా?

4 వ్యాఖ్యలు

Filed under Uncategorized

సీత నగలా…నా నానోలా?

సీత నగలా…నా నానోలా?
హనుమంతులవారికి ఈగ సందేశం(ఈమెయిల్) ద్వారా కొన్ని నా నానోలు (నగలు) పంపాను. వీలైతే ఓసారి దృష్టి సారించండి! http// naanoelu.blogspot.com//

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized