Monthly Archives: ఆగస్ట్ 2009

మీనాక్షి కూనిరాగాలు: తడి తడి రాగాలు- అనురాగాలు-4

“వైఫూ, కమానంటే
నో నో అనీ యెదవు
నీ మథర్ తో నే దెల్పెదన్, గోపాలా బాలా…
నీ మథర్ తో నే దెల్పెదన్. తకిట తక ధిమి…
నీ మథర్ తో నే దెల్పెదన్”….
హ హ హా! గమత్తైన పాట కదూ! ఇక వినుకోండి మహాశయులారా ఈ పాట కథా- కమామిషూ!
అనగనగా — అంటే దాదాపు ఎనభై రెండుసంవత్సరాల క్రితం మాట! ఓ ఎనిమిది సంవత్సరాల పిల్ల! ఆవిడగారి కి , 11 సంవత్సరాలొచ్చేక వాళ్ళ బావ తో పెళ్ళి చేయడానికి పెద్ద లందరూ కలబడి నిశ్చయించేసారు! అక్కడి తో అయ్యిందా! ఉత్తరమ్ముక్క రాసేటంత తెలుగు వచ్చును కదా, ఇక కాస్త సంగీతం నేర్పిస్తే, మా వాడికి కాస్త బాగుంటుంది అని ఆ పెద్దవాళ్ళలో ఒకాయన సెలవిచ్చేసారుట!
అది మొదలూ! ఆ కుగ్రామంలోకి రోజూ వచ్చి బోధించే మాస్టారుని వెతికి పట్టడం, వారు రోజూ వచ్చి ఈ అమ్మాయి కి సంగీత పాఠాలు మొదలెట్టడం అన్నీ మొదలై పోయాయి. మన అమ్మాయి కేమో గంగరావి చెట్టు కి వ్రేలాడు తున్న ఉయ్యాల మీదే మనసూ! కాని పాపం ఏమి చేస్తుంది! ఇక ఆ సంగీతప్పంతులుగారి విషయానికొస్తే ఏదో వానాకాలం చదువులు, వానా కాలపు సంగీతం, వానా కాలపు ఆదాయమే మరీ! కూటి కోసమే కదా కోటి విద్యలు!
అట్టి గురువుగారు! ఇట్టి శిష్యురాలు! ఇక సంగీత అధ్యాయనం ఇలా సాగింది–
“స రి గ మ ప ద ని స”…ప్రయాణం బడలిక చేత మాస్టారు తూలుతున్నారు. అవతల గంగరావి చెట్టు కొమ్మన ఉయ్యాల త్రాడు కూడా ఊగుతూ అమ్మాయిని పిలవడం మొదలు పెట్టింది.దాంతో అమ్మాయికి రిమ్మతెగులు పుట్టుకొచ్చింది. అప్పుడూ అమ్మాయి అందుకుంది ఇలా…”స రి గ మ ప ద ని స…సచ్చిపోరా ముండాకొడక…” అంటూ తేల్చేసింది. తూలుతున్న మాస్టారు “ఆ…ఏమిటీ…” అంటూ లేచేసారు. మన అమ్మాయి మళ్ళీ అందుకుంది “స రి గ మ ప ద ని స, స ని ద ప మ గ రి స…” ఈ సారి మాత్రం కరెక్ట్ గానే పాడింది!
ఇక ఈ పెద్దవాళ్ళకి  ఈ సాధన ఏదో చెవులబడి, మురిసి పోయి, పనిలో పని ఓ ఇంగ్లీషు పాట కూడా మా కుర్రదానికి నేర్పించెయ్యండి అని గురువుగారిని వేడుకున్నారట! ఇదిగో పైన నే చెప్పిన పాట అదే! తన అరవయ్యో ఏట ఈవిడ తన మనవరాలితో ఈ ఉదంతమంతా చెప్పుకుని పక పక పక మనేసుకుంది!
ఆవిడ దగ్గర నే నేర్చుకున్న మానస పూజ
“కర్ణంబులవి లోప కర్మంబులు గాగ,
ప్రాణంబులుపచర్య భటులు గాగ,
గంగ ప్రముఖనాడి కరజలంబులు గాగ,
షట్కమలములు మీకు పుష్పములు గాగ,
ఝఠరాగ్నిహోత్ర ప్రజ్వల ధూపవిధులు గాగ,
పటుజీవకళలు దీపములు గాగ,
నందితానందంబే నైవేద్యంబు గాగ,
రవిసుతసత్జ్యోతులు హారతులు గాగ,
అంగదేవాలయంబున సహస్రపీఠ కమలమందు,
కొలువై యున్నట్టి శాంతమూర్తిన్
మదీయా భక్తిజనకసోపేతుడగుచున్నట్టి  శ్రీ రామచంద్రుని
ఆత్మలో తలంతు తత్వ విధుల్”.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు

Filed under మీనాక్షి కూనిరాగాలు